డా.నరసింహారావు నేత, ప్రొఫెసర్, చర్మ, సుఖవ్యాధుల విభాగం, గాంధీ హస్పటల్ హైదరాబాద్
దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే
సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
.
నీటి పొక్కులు - హెర్పిస్ సింప్లెక్స్ / Herpis Symplex
హెర్పిస్ సింప్లెక్స్ (హెచ్‌సీవీ) అనేది లైంగికంగా, ముద్దుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరస్. ఇది ఒంట్లో చేరిన 3 రోజుల్లో జననాంగాల మీద, పెదవి చివర్లలో నీటి పొక్కులు, తీవ్రమైన నొప్పి, మంట, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. దీన్ని గుర్తించి 24 గంటల్లో చికిత్స తీసుకుంటే మళ్ళీమళ్లీ రావు. లేకపోతే ఈ వైరస్ నాడుల్లో చేరి, నాడీ మూలల్లో (నెర్వ్ గాంగ్లియా) స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కానీ బయటకు లక్షణాలేం ఉండవు. ఆ తర్వాత- తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, జ్వరాల వంటి ఇతరత్రా సమస్యల కారణంగా ఒంట్లో రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనపడిందంటే చాలు..ఇది విజృంభించి, తిరిగి ఉద్ధృతమై మళ్లీ జననాంగాల వద్ద, పెదవుల కొనల్లో పొక్కులు తెచ్చిపెడుతుంటుంది. వీటివల్ల తీవ్ర మానసిక వేదనకు లోనవుతుంటారు. కొందరు పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం సజావుగా సాగుతుందా? లేదా? వంటి ఎన్నో సందేహాల్లో కూరుకుని, డిప్రెషన్‌లోకీ వెళ్లిపోతుంటారు. .
చికిత్స: నీటిపొక్కులు కనపడ్డప్పుడు ఒక వారం యాంటీవైరల్ మందులు తీసుకుంటే పొక్కులు చాలావరకూ తగ్గుతాయి. అయితే కొందరిలో ఆ తర్వాతా మళ్లీమళ్లీ వస్తుంటాయి. ఏడాదికి 1-2 సార్లు వస్తుంటే- వచ్చినప్పుడు మందులు తీసుకుంటే సరిపోతుంది. 6 కంటే ఎక్కువసార్లు వస్తుంటే మాత్రం దీర్ఘకాలం యాంటీవైరల్ మందులు తప్పవు. భాగస్వాములకూ పొక్కులు కనబడితే వాళ్లూ ఇదే చికిత్స తీసుకోవాలి.
నిర్లక్ష్యం చేస్తే.. పొక్కులు తరచూ వేధించటమే కాదు.. అరుదుగా మెదడు పొరల్లో వాపు (మెనింజైటిస్) వంటి తీవ్ర సమస్యలూ రావొచ్చు. కొన్నిసార్లు పురుషుల్లో ఈ వైరస్ ఒంట్లో ఉన్నా పైకి ఏ లక్షణాలూ ఉండకపోవచ్చు. కానీ వారి ద్వారా భాగస్వామికి సంక్రమించొచ్చు. గర్భిణులు హెర్పిస్ సింప్లెక్స్ బారినపడితే.. ఈ వైరస్ పిండానికీ సోకొచ్చు. దీంతో పిండం మెదడు పొరల్లో వాపు, అవయవ లోపాలు, తక్కువ బరువుతో పుట్టటం, మృత శిశువు జన్మించటం వంటి ముప్పులూ పొంచి ఉంటాయి. కాబట్టి ముందే దీనికి చికిత్స తీసుకోవటం అవసరం. అలాగే గర్భిణికి నీటిపొక్కులుంటే కాన్పు సమయంలో వారి ద్వారా పిల్లలకూ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి సిజేరియన్ కాన్పు సూచిస్తారు. హెర్పిస్ సింప్లెక్స్ ఉన్నవారు సంభోగ సమయంలో కండోమ్ ధరించటం, పొక్కులున్నప్పుడు ముద్దుల వంటివి పెట్టుకోకపోవటం మంచిది.